మీరు సరిగ్గానే చదువుకున్నారండీ. ముద్దపప్పు అందరికీ బావుంటుంది కదా? నాకూ చాలా బావుంటుంది.
ముద్దపప్పు నచ్చని వాళ్ళూ ఉంటారని తెలిసాక నాకు కలిగిన హాశ్చర్యం ఇంతా అంతా కాదు. భూమ్మీద రకరకాల జనాలుంటారూ అని ఎవరో అంటే విన్నట్లు బాగా గుర్తుంది. కాని ముద్దపప్పు నచ్చని మాలోకాలూ ఉంటారన్నది ఒకపట్టాన నమ్మబుధ్ధి కాలేదండి.
అప్పుడేమో నాకు జ్వరం వచ్చింది.
జ్వరం వస్తే రెండు లాభాలున్నాయి. మొదటిది ఇంచక్కా స్కూలు ఎగ్గొట్టెయ్యచ్చును. మనంతట మనం బడి మానేస్తే నాన్నకి కోపం వస్తుంది కాని జ్వరం వస్తే ఇంక బడి మాటే లేదు. అదొక లాభం.
ఇంకో లాభం ఏమిటంటేనూ, హార్లీసు లేమిటి బోర్లీసు లేమిటి బోలెడు పళ్ళేమిటి, పళ్ళరసాలేమిటి అవన్నీ లాగించెయ్యచ్చును. రోజూ ఒక పండు - అదీ రాత్రి చదువుకునేటప్పుడు లాంటి తలాతోకా లేని రూల్సు ఏమీ ఇంక ఉండవు.
కాకపోతే జ్వరం అంటే రెండు నష్టాలూ ఉన్నాయి లెండి. మొదటిది కథల పుస్తకాలు చదువుకుంటుంటే అమ్మా కోప్పడుతుంది, నాన్నా కోప్పడతాడు. రెష్టు తీసుకో పుస్తకాలు ఆనక చదవచ్చూ అంటూ ఒకటే నస పెడతారు. మరి జ్వరం లేనప్పుడైతేనే పుస్తకాలు ముందేసుకుని కూర్చోకపోతే తప్పన్న మాట. అదేంటో మరి.
ఇక రెండవ నష్టం. అదింకా భయంకరం. జ్వరం ఒక్కోసారి చేదుగా చస్తుంది. అప్పుడు కనీసం హార్లీసు కూడా సయించదు. దిక్కుమాలిన మందులైతే అవింకా చేదు. అలాంటి జ్వరం కాని వచ్చిందా అంతకంటే స్కూల్లో సోషల్ క్లాసులు నయం అనిపిస్తాయి. నిజం.
ఈ సారి జ్వరం ఎందుకో కాని ఎప్పట్లాగా నాలుగు రోజుల్లో తగ్గలేదు. దేవుడి దయవల్ల హార్లీసులూ అవీ బావుంటూన్నాయి. నోరు చేదు లేకపోతే అన్నీ బాగుండవూ మరి.
ఐతే ఈసారి జ్వరానికి ఓప్రత్యేకత ఉంది. అది నాంచారమ్మ గారు.
ఆవిడ మాయింట్లో వంటక్కుదిరి వారం కూడా కాలేదు. ఈలోగా నాకు జ్వరం వచ్చింది. పాపం ఆవిడ వల్ల రాలేదు లెండి. ఐతే ఆవిడ గంట గంటకీ వచ్చి వళ్ళంతా తడిమి కాఫీయో హార్లీసో బోర్లీసో మరొకటో ఇస్తోంది.
ఈ కాఫీ యేదో ఎప్పుడూ తాగలేదు. కొంచెం చేదుగా ఉన్నా అదేంటో అదీ బాగానే ఉంది. కొంచెం తియ్యగా కూడా ఉంది కదా మరి. అందుకన్న మాట.
రెండు రోజులో మూడు రోజులో పోయాక అమ్మ కేకలు వేసింది నాంచారమ్మ గారిని. పిల్లాడికి కాఫీ ఇవ్వకండి వాడికి అలవాటు లేదు అని. అప్పటికే పద్దెనిమిదో ఎన్నో కాఫీలు తాగేసానే మరి!
అమ్మతో అందాం అనుకున్నాను కాని అమ్మ నాంచారమ్మ గారిని అలా కేకలు వేసింది కదా అని భయం వేసి చెప్పలేదు. ఇంక నాకు కాఫీలు రాలేదు.
నాకేమో కాఫీ తాగాలని ఉంది. అంచేత సందుచూసుకొని వంటింట్లోకి వెళ్ళాను నాంచారమ్మ గారిని మెల్లగా అడుగుదామని. పప్పులుడక లేదు. అమ్మ వంటింట్లోకి వెళ్తూ కనబడింది. వెనక్కి నా బెడ్ దగ్గరకి పోతుంటే వెనకనించి అమ్మ మాట వినిపించింది. ఈ పూటకు ముద్దపప్పు చెయ్యండి అని.
నాకొచ్చిన ఏడుపు ఇంతా అంతా కాదు. అయ్యో ఈ జ్వరం వస్తే ముద్దపప్పుని మిస్ అవుతున్నాం అని ఇంత వరకూ తట్టలేదే అని భలేబాధ కలిగింది.
ఉపాయం అమ్మే చెప్పింది. చెప్పిందంటే నేరుగా నాతో నోటితో చెప్పలేదు లెండి. మా ఫ్రిజ్ ఉందా. దానికి కొన్ని మేగ్నెట్లు అతుక్కుని ఉన్నాయా. అమ్మేమో కొన్ని కాగితాలను ఆ మేగ్నెట్ సాయంతో ఫ్రిజ్‌కి అతికిస్తుందిగా. అదే ఉపాయం అన్న మాట. అమ్మెందుకు చిన్న చిన్న కాగితాలు అలా అతికిస్తుందీ, ఏవన్నా మర్చిపోకుండా గుర్తుంచుకుందుకు కదా. మనం కూడా అదే చేస్తే బావుంటుంది కదా.
ఆ రోజు నాంచారమ్మ గారిని అడిగితే అన్నంలోకి ఏమేం చేస్తున్నారో చెప్పింది అమాయకంగా. మన ప్లాన్ తనకి తెలీదుగా. వాటిల్లో ముఖ్యమైనది వంకాయ కారం పెట్టి కూర. నోటుబుక్కులో ఓ కాగితం చింపి, దానిమీద తారీఖు కూడా వేసి మరీ వంకాయ కారం పెట్టిన కూర అని రాసి ఫ్రిజ్‌కి అతికించాను.
ఎందుకో గాని దాన్ని అమ్మ గమనించలేదు. నాంచారమ్మకి చదువు రాదేమో! ఫ్రిజ్ దగ్గిరకి పది పాతిక సార్లు వస్తుందా, ఆ కాగితం చూసినా ఏమీ అడగలేదు ఎవరితోనూ చెప్పనూ లేదు.
మర్నాడు ముద్దపప్పు వండుకున్నారు. ఆ రాత్రి బంగాళా దుంపలవేపుడు చేసారు. అవి ఫ్రిజ్ మీద కాగితంలో నోట్ చేసానంతే. ఇలా నాకు జొరం తగ్గేసరికి, లిష్టు బాగానే పెరిగింది.
నాకు మాత్రం ఇన్నాళ్ళూ హార్లీసులూ బోర్లీసులతో పాటు బ్రెడ్లూ పాలూ వంటివి మాత్రం పెట్టే వారు.
ఒక రోజున అమ్మ నీకు జ్వరం తగ్గిపోయింది కదా, పత్య పెడతానూ ఈ వేళ అంది.
ఐతే నాకు ముద్దపప్పేసి పెట్టు అని అడిగాను.
అమ్మ నవ్వింది.
ఉహూ. ఇప్పుడు కాదు. అరగదు నీకు. తర్వాత చేసుకోవచ్చులే ముద్దపప్పు, దానికేం భాగ్యం. అని అన్యాయంగా తిరస్కరించేసింది.
నాకు బోలెడు ఉక్రోషం వచ్చింది. కుదరదు. ఇప్పుడే ముద్దపప్పు కావాలి. మీరు ఇప్పటికి రెండు సార్లు వండుకున్నారు ముద్దపప్పు. నేనన్నీ నోట్ చేసుకుంటూనే ఉన్నాను తెలుసా. అన్నట్లు ఒకసారి నువ్వూ నాంచారమ్మా చూడకుండా వంటింట్లో గిన్నెలు కూడా ఇనస్పెక్షన్ చేసాను. నాంచారమ్మని ముద్దపప్పు చేయమను నిక్కచ్చిగా అడిగేసాను.
అమ్మ నా హడావుడి చూసి నవ్వింది.
ఓరి పిచ్చి రాముడూ, ఎలా చెప్తే అర్ధం అవుతుందిరా నీకూ? పత్యం నాడు ఎవరూ ముద్దపప్పు తినరులే. తరవాత చేయిస్తానుగా ఊరుకో అనేసి వెళ్ళిపోయింది.
నేను లిష్టుకేసి దిగాలుగా చూసాను, రెండు ముద్దపప్పులు, వంకాయ కారం పెట్టి కూర, బంగాళా దుంపల వేపుడు, కొబ్బరిపచ్చడి, అనపకాయ ముక్కల పులుసు, ఇంకా మరికొన్ని నా ప్రియాతిప్రియమైన ఆధరువులు అన్నీ ఎప్పటికి చేసిపెట్టి నా బాకీ తీరుస్తారు వీళ్ళు అని బెంగ పెరిగిపోయింది.
అమ్మ కనీసం రేపు అనైనా అనలేదు. తరవాతట తరవాత. అంటే ఓ వారం పదిరోజుల తరువాత అనా? ముద్దపప్పు కోసం అన్నాళ్ళాగుతారా ఎవరైనా? పోనీ వీళ్ళు నా జొరం తగ్గేదాకా ఆగి చేసుకోలేక పోయారూ ముద్దపప్పు? ఈవారం రోజుల్లోనూ రెండు ముద్దపప్పులు వండుకుని మెక్కారు!
ఐతే, ఆ రోజున నాంచారమ్మ కనిపించ లేదు. ఎవరో వెంకాయమ్మ అట, ఆవిడ చేస్తోంది వంట మాయింట్లో.
మా యింట్లో ఐతే రోజూ పప్పు ఉండాలి. అందుచేత తొందర్లోనే ముద్దపప్పు చేస్తారు కదా అని చూస్తే వారం ఐనా ముద్దపప్పు లేదు, పదిహేను రోజులైనా ముద్దపప్పు లేదు.
ఓ రోజు అమ్మని అడిగాను, నా ముద్దపప్పు ఎక్కడా అని.
ఓ అదా, వెళ్ళి వెంకాయమ్మకు చెప్పు అందమ్మ.
ఉత్తి పప్పు ఏం బాగుంటుంది బాబూ, ఓ దోసకాయో మామిడి కాయో మరోటో వేసి చేయాలి. లేదా బచ్చలి కూరో తోటకూరో వేసి చేయాలి, ఉత్తపప్పు అంత టేస్టీగా ఉండదు. ఈవేళ మనింట్లో టమేటోపప్పు అందావిడ.
కాదు, ఈవేళ ముద్దపప్పు చెయ్యండి. అమ్మ చెప్పమంది అని చెప్పాను.
ఎలాగు బాబూ, ఐనా ఇదిగో టమేటోపప్పు తయారైపోయింది కూడానూ అందావిడ.
ఔరా ఔరా. ముద్దపప్పు నచ్చని మనుషులు కూడా ఉంటారా!
రెండు ముద్దపప్పులు, వంకాయ కారం పెట్టి కూర, బంగాళా దుంపల వేపుడు, కొబ్బరిపచ్చడి, అనపకాయ ముక్కల పులుసు....గెస్టులు వస్తే ఇది మా ఇంట్లో , స్టాండర్డ్ మెనూ సార్. ఊరిన మిరపకాయలు, గుమ్మడి కాయ వడియాలు ఆడ్ చేసుకోండి.
రిప్లయితొలగించండిఅప్పుడు గెష్టులు వచ్చారే లేదో గుర్తు లేదు కానీండి, అవి చేసుకుతిన్నారన్నది గుర్తు కదా. ఎందుకైనా మర్చిపోతానని రాసిపెట్టుకొని మరీ దబాయించి చేయించుకోడం అన్నమాట. లేకపోతే నాకు జొరం వచ్చినా కూడా మంచిమంచివి చేసుకుని తినేస్తారేం నాకేమో బ్రెడ్డులూ గాడిదగుడ్డులూ పెడుతూ. తిరిగి వసూలు చేసుకోవద్దా? మీరే చెప్పండి?
తొలగించండిsir , baga gap theesukuntunnaaru ? please keep writing.
రిప్లయితొలగించండి