మా అమ్మ చాలా మంచిది. ఊళ్ళో బోలెడు మంది రాముడు అల్లరి పిల్లాడమ్మా అనేవారు కాని అమ్మ మాత్రం మా పిచ్చి రాముడు ఎంతో బుధ్ధి మంతుడు అనే అనేది ఎప్పుడూ.
ఊళ్ళో అల్లరి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. అమ్మ వాళ్ళతో చేరద్దనేది. ఎందుకంటే నేను అల్లరి పిల్లాణ్ణి కాననేగా. కాని ఆపిల్లకాయలూ వాళ్ళ అమ్మలూ మాత్రం ఈ పిచ్చి రాముడికి పొగరు అనెసే వాళ్ళు.
మా అమ్మ మాత్రం మా రాముడు బంగారం అనేది. ఆవిడ ఉన్నన్నాళ్ళూ అప్పుడప్పుడూ బంగారం అని కూడా పిలిచేది.
నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అమ్మకి కోపం వచ్చేది కాని సాధారణంగా అమ్మకు అస్సలు కోపం లేదు అనే చెప్పాలి.
ఓ సారి మా మాష్టరు గారు ఒకాయన ఇంటికి వస్తే ఆయనతో అమ్మ తగువు వేసుకుంది. మరి ఆయన మీ రాముడు వట్టి మేదకుడు అంటే ఊరుకుంటుందా.
ఈ మేదకుడు అనే మాట ఏమిటిరా అంటే తెలివైన వాడు అని బళ్ళో శీను గాడు చెప్తే కాబోలనుకున్నాను. కాదట. మేష్టారు ఆ ముక్క అంటే నా పిచ్చి రాముడికి తెలివితేటలు లేవంటావా అని అమ్మ ఇంతెత్తున లేచింది.
అప్పుడు ప్రైవేటు మాష్టారు దగ్గర చేరానా, ఆయన కూడా అమ్మ దగ్గరకి వచ్చి అబ్బే లాభం లేదండీ అనేసి చీవాట్లు తిన్నాడు.
చదువు చెప్పేది లాభం కోసమా? కాదు కదా? మాష్టర్లకి కూడా ఆముక్క తెలియకపోతే ఎట్లా? దిక్కుమాలిన హిందీ రాకపోతేనో ఏరాజు ఎలా పరిపాలించి చచ్చాడో గుర్తుండక పోతేనో నేను మేదకుణ్ణి ఐపోతానా? మళ్ళి ఇంగ్లీషులో పాసు మార్కులు వస్తున్నాయా లేదా? లెక్కల్లో మంచి మార్కులు వస్తున్నాయా లేదా? సైన్సూ అంతే కదా. ఆ హిందీ ఏమన్నా కొలత బద్దా ఏమిటీ?
అప్పుడు అమ్మ ఏం చేసిందో తెలుసా మీకు? ఇంకిలా పని కాదని, తనే రాత్తిళ్ళు కొంచెం తీరిక చేసుకొని హిందీ నేర్పింది. ఎంతైనా హిందీమాష్టారి కూతురు కదా. ఇప్పుడు ఇంకా అంత బాగా రాకపోయినా పాసుమార్కులైతే వచ్చేస్తున్నాయండీ మీ వాడికి అని నాన్నతో హిందీ మాష్టరు గారే చెప్పారా లేదా?
అదీ అమ్మ అంటే.
అమ్మ నాకు దేవుడికి పూజలు చేయటం కూడా నేర్పింది. అసలీ పూజలూ అవీ ఎందుకూ, నువ్వంత సేపు హైరానా పడి బోలెడన్ని ప్రసాదాలని చేయటం ఎందుకూ బొమ్మ లెక్కడన్నా భోజనం చేస్తాయా అంటే అమ్మ ముందైతే కళ్ళెర్ర చేసింది కాని మళ్ళా నవ్వేసింది. దేవుడు మనకి కనిపించకుండానే తింటాడని చెప్పింది కాని నాకే నమ్మకం కుదరటం లేదు. తింటే మరి ఏ పళ్ళెంలోనూ పెట్టింది పెట్టినట్లే ఉంటోందే తరక్కుండా? ఒరే పిచ్చి రాముడూ దేవుడి గురించి అలా మాట్లాడకూడదూ అంటుందే కాని ఎందుకో చెప్పదు కదా. పైగా పెద్దయ్యాక నీకే అంతా తెలుస్తుంది అని హామీ ఇచ్చింది. ఏదీ, పెద్దయ్యానా లేదా? ఐనా తెలిసి చావటం లేదే!
ఆమధ్య వినాయకుడు పాలు తాగాడూ మేం చూసామూ అని బోలెడు మంది చెప్పారు. పాలు తాగగా లేనిది ఉండ్రాళ్ళు తినటానికి మాత్రం ఎందుకు తొండం చాపడూ అని! అమ్మ నడిగితే అలా అనకూడదూ తప్పూ అనేసిందా. గుళ్ళో పూజారి గారైతే హోరి పిచ్చాడా, ప్రతివాడూ తాగిస్తే పాలు తాగుతాడా అలాగే ప్రతివాడూ పెట్టిన ఉండ్రాళ్ళు తింటాడా అన్నారు. సరే కదా అని చూస్తే అయన పెట్టిన ఉండ్రాళ్ళూ తిన్నాడు కాదు కదా. నిలదీస్తే పోరా పిచ్చి రాముడూ అనేసా డాయన.
అదంతా అలా ఉంచి పూజ చేయటం మాత్రం బాగుంటుంది నాకు. స్తోత్రాలూ అవీ బట్టీ పడితే బుర్ర పెరుగుతుందని అమ్మ చెప్పింది. కొంచె పెరిగిందని కూడా నా అనుమానం. అదొక కారణం. అదీ కాక పూజంటే చేసే ప్రసాదాలూ బాగుంటాయీ మళ్ళా పూజని ఫోటోలు తీస్తే బొమ్మలు కూడా ఎంతో బాగుంటాయి. అందుకన్న మాట.
ఇంకా ఎన్నో నేర్పింది అమ్మ నాకు. వంట కూడా. మగాళ్ళకు మాత్రం ఎందుకు వంట రావద్దూ? రేపు పెళ్ళాం ఊరికి వెళ్తే వంట రాక పోతే చిక్కుల్లో పడనూ మరి? ఈమాట కూడా అమ్మే చెప్పింది. పాయింటే కదా. మీ అమ్మలు మీకీ పాయింటు చెప్పలేదూ అనుకోండి. మీరు వంట నేర్చుకోరు. అప్పుడు మీకర్మ అన్న మాట.
అన్నట్లు నాన్నకీ వంట వచ్చును. కాని బడాయి ఎక్కువ. చచ్చినా వంట చెయ్యడు. కాని అదలా చెయ్యీ ఇదిలా చెయ్యీ అని సలహాలు మాత్రం ఇస్తూ ఉంటాడు ఎప్పుడూ అమ్మకి.
మళ్ళా అమ్మ మాత్రం సలహాలు ఇవ్వకూడదు తనకి. సోఫాలు బాగానే ఉన్నాయి కదా ఎందుకు మార్చటం అన్నా వినకుండా అవన్నీ అమ్మేసి కొత్తవి కొన్నాడా లేదా ఏదో పార్టీ వంక పెట్టి? నాకేమో ఎర్ర రంగు బాగుండదు. తీరా చూస్తే కొత్త సోఫాలన్నీ ఎర్రగా చచ్చాయి. ఎరుపు కాదట. బర్గుండీ అనాలట. గాడిద గుడ్డు కాదూ. ఎరుపు ఎరుపే కదా, ఇంగ్లీషులో రెడ్ అనే అంటాం కదా. ఇప్పుడు కొత్తగా బర్గుండీ అని దాని పేరు మార్చారు కాబోలు. అంత మాత్రం చేత ఆ రంగు అందంగా ఉండి చస్తుందా చెప్పండి.
అందుకే అమ్మతో చెప్పాను. ఈ సోఫాలేమిటే దరిద్రం రంగు అని. సర్లే, మీనాన్న ఎప్పుడన్నా నా మాట వింటారా ఏమిటీ అని నిజం చెప్పేసింది.
ఐనా అమ్మ ఆ సోఫాలకి తెల్ల కవర్లు వేసేసింది. నాన్న మొత్తుకున్నా వినకుండా. తెలుపెంత బాగుంటుందీ! ఈనాన్నలకి ఆట్టే తెలియదు. తొందరగా మాసిపోతాయని ఒకటే సణుగుడు. బడాయి కాకపోతే తానెప్పుడన్నా ఉతికాడా పెట్టాడా బట్టల్ని. ఆ కవర్లు మాస్తే వాటి సంగతి చూసేది అమ్మే కదా. మరి ఎందుకంత నస అని!
అమ్మెంత మంచిదీ అంటే చెప్పలేం. నాన్నేమో ఒరే రాముడూ ఆ సోఫాల్ని ఎక్కీ తొక్కీ మాపెయ్యకు అని గదమాయిస్తే అడ్డొచ్చి కింద కూర్చుని చదువుకొనే కర్మమేం నా పిచ్చి రాముడికి, వాళ్ళ నాన్న రెందు చేతులా సంపాదించి పోస్తుంటేనూ? వాడలా దర్జాగా కూర్చుని చదువుకుంటుంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోతాయా అని నిలదీసింది. అంతే నాన్నింకేం మాట్లాడ లేదు.
ఓ. ఇలా అమ్మ గురించి ఎంతన్నా చెప్పొచ్చు. నాన్న గురించి కూడా చెప్పొచ్చు అనుకోండి అలాగే, కాని ముఖ్యంగా అమ్మ గురించే ఎక్కువ చెప్పాలేమో. ఎందుకంటే అమ్మ ముద్దు చేసినట్లు నాన్నెక్కడైనా ముద్దు చేస్తాడా చెప్పండి.
అమ్మ ది గ్రేట్ అని ఒక సారి అంటే ఎంత బాగా నవ్విందో అమ్మ.
అందుకే మీ క్కూడా చెప్తున్నాను. తెలుసుకోండి. అమ్మ ది గ్రేట్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా పిచ్చి రాముడు గారూ, మీకో అడుసు గండం ఉందనుకుని తెగ సానుభూతి ఒలకబోసాను గానీ మీరే గడుసు పిండం అన్న ప్రగాఢానుభూతి ఢాబాలో వేసిన రెండో అడుక్కే దట్టించేస్తారన్న తెలివిడి లేని చర్య అది. ఇకపై ఇరుకుపాలెమోళ్ళతో ఎకెసెక్కాలెట్టుకోనని అందరికీ తెలిసేట్టు బెంమానందంమీదొట్టు. ఇక మనిద్దరం ఫ్రెండ్స్ అని ఈ బ్లాగోళ్లందరి మీదొట్టు. ఇదే కరెట్టు. కాదన్నోడి బుర్ర ఫట్టు ... 😠😠
రిప్లయితొలగించండిఅసలే కరోనా కాలం, ఆ పై మీ నవ్వుల గేలం, మరింకేం చెయ్యగలం! గడప దాటకుండా గలం గలం ఘల్ ఘల్! అణుమానం లేదు మీరు బెమ్మానందం బ్రెదరే! మీవి నవ్వులు పంచే కధలే! మీది ఇరుకుపాలెమే! మేం నవ్వుకోడమే! 😁😁 ...
https://www.youtube.com/watch?v=25kk45KoYRg
పిచ్చోళ్ళైనా తెలివిగలోళ్ళైతే - వెంటబడితే - ఒక నమస్కారానికి రెండు నమస్కారాలెట్టాలని మా అమ్మ చెప్పింది. మీకు రెండు నమస్కారాలు పిచ్చి రాముడు గారూ ... 🙏 🙏 ...
హాయిగా చదివించేస్తున్నారు ఆనందం విదిలెంచేస్తున్నారు. wishing us many more happy returns of these days ... day by day ... happy blogging sir ... ✍️✍️ ...
jf/jk
అమ్మ మాట అందాల బాట . కధనం బాగుంది.
తొలగించండిబండి రావు గారు. మీ మాటలు నచ్చాయి. చాలా సంతోషం అన్నమాట.
తొలగించండిలక్కరాజు రావు గారు. అవునండి అమ్మ మాటలు బాగుంటాయి కదా. ఎప్పుడూ బాగుంటాయి.
తొలగించండి